Quick Enquiry | info@teluguwomenpoets.com

లక్ష్యం

శతాబ్దాలుగా, సమాజంలో తమ అస్థిత్వాన్ని నిలుపుకోవడానికి పోరాడుతూనే, తెలుగు భాష సాహితీ వికాసాలకు కవయిత్రులు తమదైన కృషిని కూడా చేర్చారు. అయినా తెలుగు సాహిత్య రంగంలో వారికి దక్కవలసినంత గౌరవమూ, గుర్తింపూ దక్కలేదు. వారి సాహిత్యాభినివేశాన్ని, సమాచారాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి, నేను ఈ వెబ్ సైట్ మాధ్యమాన్ని ఎన్నుకొని, వారి వ్యక్తిగత, సాహిత్య జీవిత వివరాలను లభ్యమైనంతవరకూ పొందుపరిచాను. 12వ శతాబ్ద కాలం నుండి ప్రారంభించి, నేటివరకూ తమ భావ వ్యక్తీకరణతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన తెలుగు కవయిత్రులను, వారి రచనలను ఈ వెబ్ సైట్ లో స్ఫురణకు తెచ్చుకోవటం జరిగింది. వారి ఫోటోలను కూడా దొరికినంత వరకూ అందంగా అమర్చే ప్రయత్నం చేశాను. దాదాపు 400 మంది కవయిత్రుల విశేషాలను భావితరాల వారు జ్ఞాపకం చేసుకోవడానికి వీలుగా ఇందులో రూపొందించడం జరిగింది.

తెలుగు సాహిత్యంలో కవయిత్రులకు సంబంధించి ఇటువంటి సమగ్ర ప్రయత్నం ఇదే మొదటిదిగా నేను భావిస్తున్నాను. ఇంక ముందు కూడా, ఎప్పటికప్పుడు కవయిత్రుల, కవితల తాజా సమాచారాన్ని ఈ వెబ్ సైట్ లో అప్ డేట్ చేయడానికి ప్రయత్నిస్తాను.

స్త్రీల సాహిత్యాన్ని గురించి చేసే పరిశోధనలు చాలా తక్కువ. ఎందుకంటే వారి గురించి సమాచారాన్ని సమీకరించడానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. ఇది నా స్వానుభవం. అందువల్ల, ఇకముందు స్త్రీల రచనలపై  పరిశోధన చేసే ఆసక్తి ఉన్న వారికి నా ఈ సమాచారం ఉపకరిస్తుందని భావిస్తాను.

తెలుగు భాషకు ప్రాచీన హోదా లభ్యమైన ఈ తరుణంలో, దాదాపు పురుషులతో సమానంగా వారి శక్తికి మించి సాహితీ కృషిని చేసి తెలుగు సంస్కృతికి తేజో ఫలాలను అందించి, జాతిలో సగమైన స్త్రీలను చైతన్యవంతులను చేసే దిశగా ప్రయత్నం చేసిన విదుషీమణులను గుర్తుచేసుకొని గౌరవించటం మన కనీస బాధ్యతగా నేను అనుకుంటాను.

స్త్రీలు చదువుకోవడానికి నోచుకోని ఆ కాలంలో, అనేక కష్ట నష్టాలకోర్చి, చదువుకోవటమే కాకుండా, మగవారితో సమానంగా, సాహిత్య మాధ్యమంలో తమ భావాలను వ్యక్తీకరించిన మన కవయిత్రుల రచనలు చెదలు పట్టిపోకుండా మన భావితరాల వారికి అందించడానికే నా ఈ చిన్ని ప్రయత్నం. ఎటువంటి లాభాపేక్ష లేకుండా, తెలుగు భాషపై, అందునా స్త్రీల కవిత్వం పై నాకున్న మక్కువతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను.